ఇంటర్నెట్ డెస్క్: స్థానిక చట్టాలను ఉల్లంఘించిన వారి పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గట్టి చర్యలకు ఉపక్రమించింది. మొత్తం 40 మంది పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కార్యాచరణను ప్రారంభించినట్లు యూఎస్ న్యాయశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ దేశ ఆధునిక చరిత్రలో ఇదే అత్యంత అతిపెద్ద పౌరసత్వ రద్దు కార్యక్రమమని స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఒక భారత సంతతి వ్యక్తితో పాటు చైనా, పాకిస్థాన్, మెక్సికో, కాంబోడియా, నేపాల్, అఫ్గానిస్థాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.

పౌరసత్వ రద్దు ముప్పును ఎదుర్కొంటున్న వ్యక్తులు పలు తీవ్ర నేరాలకు పాల్పడినట్లు అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ఆరోపించారు. విదేశీ ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించడం, హత్యలకు కారణమవడం, మానసిక వైకల్యం ఉన్నవారిపై లైంగిక దాడి ఆరోపణలు, వీసా చట్టాలను ఉల్లంఘించడం వంటి తీవ్రమైన అభియోగాలను వీరు ఎదుర్కొంటున్నారు. వీరందరిపై ప్రస్తుతం స్థానిక కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం స్థానిక చట్టాలను ఉల్లంఘించిన విదేశీ సంతతి వ్యక్తుల పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.

ఈ జాబితాలో ఉన్న భారత సంతతి వ్యక్తి బల్వీందర్ సింగ్ రెండు వేర్వేరు గుర్తింపులతో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఈ వ్యక్తి తప్పు చేసిన విషయం అతడి ఫింగర్‌ప్రింట్స్ పరిశీలన ద్వారా వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. 1999లో ఒక గుర్తింపుతో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు దాఖలు చేసిన ఆయన, 2003లో మరో గుర్తింపుతో శాశ్వత నివాసార్హత పొందినట్లు పేర్కొన్నారు. బల్వీందర్ సింగ్ వ్యవహారశైలి పలు సందర్భాల్లో ఆయన నైతికతపై సందేహాలు కలిగించేలా ఉందని న్యాయశాఖ తెలిపింది.

మరోవైపు, గూఢచర్యానికి పాల్పడిన చైనాకు చెందిన ఒక వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కూడా అమెరికా చర్యలు ప్రారంభించింది. 2021లో నేవీలో చేరిన ఆ వ్యక్తి, 2022 నుంచి మిలటరీ రహస్యాలను చైనాకు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. 2022 మే నెలలో అమెరికా పౌరసత్వం పొందిన అతడు, ఈ కేసుకు సంబంధించి 2025 ఆగస్టులో దోషిగా తేలాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, పౌరసత్వాల రద్దు ప్రక్రియను కఠినంగా అమలు చేస్తామని యూఎస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.