ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రంలో మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది.
ఈ రెండు స్థానాల్లోనూ మొదట్లో పోటీ హోరాహోరీగా సాగినప్పటికీ, రానురాను వెలువడిన ఫలితాల రౌండ్లలో టీవీకే అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. ముఖ్యంగా మదురాంతకం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి కె. మరగతం కుమారవేల్ తన ఆధిక్యాన్ని క్రమంగా పెంచుకుంటూ బలమైన స్థితికి చేరుకున్నారు. అలాగే ధారాపురం స్థానంలో తొలుత ఏఐఏడీఎంకే అభ్యర్థి బాణుమతి ముందంజలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత టీవీకే అభ్యర్థి పి. సత్యభామ పుంజుకుని ఆధిక్యంలోకి దూసుకెళ్లారు.
ప్రస్తుతం మధురాంతకం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి కె. మరగతం కుమారవేల్ దాదాపు 20 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయానికి చేరువయ్యారు. పార్టీ అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండటంతో టీవీకే శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వెలుపల పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడి విజయనాదాలు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి విజయ్ చిత్రపటాలు, పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ కార్యకర్తలు విజయోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

