ఖానాపూర్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో టింబర్ డిపో లైసెన్స్ పునరుద్ధరణ కోసం తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు లంచం డిమాండ్ చేసిన ఖానాపూర్ రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఐండ్ల రవీందర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. గురువారం నాడు ఓ టింబర్ డిపో నిర్వాహకుడి నుంచి రూ. 12 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ దాడి నిర్వహించారు.

డిపో సందర్శనకు సహకరించేందుకు మరియు లైసెన్స్ పునరుద్ధరణ నివేదికను పై అధికారులకు పంపేందుకు మొదట రూ. 20 వేలు ఇవ్వాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ డిపో నిర్వాహకుడిని డిమాండ్ చేశారు. బాధితుడు పదే పదే వేడుకోవడంతో చివరకు రూ. 12 వేలకు బేరం కుదుర్చుకున్నారు. గురువారం మధ్యాహ్నం 12.53 గంటల ప్రాంతంలో డిపో నిర్వాహకుడి నుంచి రూ. 12 వేల నగదును రవీందర్ స్వీకరించారు.

సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు అటవీ శాఖ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిందితుడు రవీందర్ తన కారులో ఉంచిన రూ. 12 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవీందర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మధు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా, దర్యాప్తు కొనసాగుతుండటంతో ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.