బెజ్జూరు: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. అనుమతించిన పరిమితికి మించి స్లాబ్ విస్తీర్ణం పెంచే వారిపై నియంత్రణ విధించడంతో పాటు, నిబంధనలు అతిక్రమిస్తే ప్రభుత్వ సాయం నిలిచిపోతుందని హెచ్చరించింది. ఈ కొత్త నిబంధనలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు నోటీసులు పంపిణీ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలామంది లబ్ధిదారులు గోడల కంటే మూడు నుంచి ఎనిమిది అడుగుల వరకు స్లాబ్‌ను ముందుకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఆర్థిక సాయం సరిపోక పేదలు అప్పుల బారిన పడుతున్నారని, మరికొందరు ఆర్థిక భారం తట్టుకోలేక నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారని భావిస్తున్నారు. ఈ ఇబ్బందులను తొలగించి, కేవలం ప్రభుత్వ సాయంతోనే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూసేందుకు స్లాబ్ వైశాల్యంపై పరిమితులు విధించారు. ప్రభుత్వ జీవో 352 ప్రకారం.. 400 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇంటికి స్లాబ్ వైశాల్యం గరిష్టంగా 500 చదరపు అడుగులలోపు ఉండాలి. అలాగే 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ గరిష్టంగా 750 చదరపు అడుగుల వరకే ఉండాలని స్పష్టం చేశారు. ఇంటి ముందువైపు స్లాబ్ పొడగింపును గరిష్టంగా మూడు అడుగులకు, మిగిలిన మూడు వైపులా కేవలం ఒక్క అడుగు మాత్రమే పొడిగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నిబంధనలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని, స్లాబ్ పరిమితి దాటితే బిల్లులు ఆపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఎక్కువ విస్తీర్ణంలో స్లాబ్ వేసిన వారు ఏఈ లేదా డీఈఈని సంప్రదించాలని సూచించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల పరిధిలో తొలి రెండు విడతల్లో మొత్తం 9,662 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో ఇప్పటికే 1,267 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలను మరింత ముమ్మరం చేశారు. డీఈఈలు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

లబ్ధిదారులు నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రకాష్ రావు తెలిపారు. స్లాబ్ సైజు ఎక్కువ వేయడం వల్ల లబ్ధిదారులపై అదనపు భారం పడి అప్పులపాలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇళ్లు కట్టుకుంటేనే దశలవారీగా బిల్లులు మంజూరవుతాయని స్పష్టం చేశారు.