ఆసిఫాబాద్ రూరల్: వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిప్యూటీ రేంజ్ అధికారి మోగేష్ కులకర్ణి పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని పీటీజీ బాలుర పాఠశాలలో సోమవారం విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మరియు వాతావరణ సమతుల్యత వంటి కీలక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ పోటీలలో నలభై మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి మహేందర్, బీట్ అధికారి ప్రకాష్, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, వార్డెన్ కృష్ణచారి తదితరులు పాల్గొన్నారు.
ఇదే ఉత్సవాలలో భాగంగా బెజ్జూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బెజ్జూరు సెక్షన్ అధికారి సాఫియా బేగం విద్యార్థులకు ప్రత్యేకంగా వన్యప్రాణి డాక్యుమెంటరీ వీడియోలను ప్రదర్శించి, అడవి జంతువుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సునీత, సెక్షన్ అధికారి సంతోష్, బీట్ అధికారి స్రవంతి పాల్గొన్నారు. సిర్పూరు (టి) లోని సాంఘిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో కూడా ఉపన్యాస పోటీలతో పాటు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్, డీఆర్వో తిరుపతి, ఇతర సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, వాచర్లు మరియు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్‌లో వన్యప్రాణి సంరక్షణపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో రేంజ్ డీఆర్వోలు ముసావీర్, అస్మా, ఎఫ్‌ఎస్‌వో అహ్మద్ అలీ, బీట్ అధికారులు సతీష్, సంగదీప్, కళ్యాణ్, లచ్చన్న, స్వర్ణలత, శిరీషలతో పాటు అనిమల్ ట్రాకర్లు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌లోనూ భారీ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డివిజనల్ అధికారి బార్గవ్ కుమార్, ఎఫ్‌ఆర్వో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వన్యప్రాణుల పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారులు రవికుమార్, గిరిబాబు, బానయ్య, జోగు, ఎల్లం, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ టి. శ్రీదేవి, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

