వాంకిడి: కోలాం గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే కృషిచేయాలని ఆదిమ గిరిజన కోలాం సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సీడాం అన్నిగా డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కోలాం సంక్షేమ సంఘం కార్యాలయంలో సోమవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని కోలాం గిరిజన మారుమూల గ్రామాలకు ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, పీఎంజన్మన్ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ భూముల విషయానికి వస్తే పాత పట్టాలు కలిగిన రైతులందరికీ కొత్త పట్టాలు రాలేదని, కొందరికి మాత్రమే అందాయని తెలిపారు. పట్టాలు రాకపోవడం వల్ల రైతులు రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలను కోల్పోతున్నారని, అర్హులైన ప్రతి రైతుకూ పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు.
చదువుకున్న కోలాం ఆదిమ గిరిజన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరారు. అలాగే కుమ్రం సూరు వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదిమ కోలాం గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమించనున్నట్లు, దీనికోసం తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఈ సమావేశంలో పీవీటీజీ సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మాన్కు, జిల్లా నాయకులు సీడాం నాగోరావ్, ఆత్రం జల్పత్ రావ్, కుమరం లింగు, ఆత్రం గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా మండల ఆదిమ గిరిజన కోలాం సేవాసంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి ప్రకటించారు.
నూతన కార్యవర్గ వివరాలు: అధ్యక్షుడిగా సీడాం పగ్గు గౌరవ అధ్యక్షుడిగా కుమరం పగ్గు ఉపాధ్యక్షులుగా కుమరం చిన్ను, ఆత్రం రాము ప్రధాన కార్యదర్శిగా ఆత్రం మాధవరావ్ కార్యదర్శిగా మడావి జైరామ్ సంయుక్త కార్యదర్శిగా ఆత్రం ఆనంద్రావ్ కోశాధికారిగా కుమరం భీంరావ్ ప్రచార కార్యదర్శిగా సీడాం భీంరావ్ సలహాదారులుగా ఆత్రం మెంగోరావ్, ఆత్రం మారుతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

